టీ – కాంగ్రెస్ గల్లీ పంచాయతీ ఢిల్లీలో..!

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ టికెట్ల పంచాయతీని ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో పెట్టారు.

తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఎన్నికల సమీపిస్తున్న క్రమంలో పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేసింది. రెండు రోజులుపాటు ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ కానున్నది. ఈ భేటీలో కమిటీ చైర్మన్ మురళీధరన్, పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు భట్టి తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై తుది కసరత్తు పూర్తి చేయబోతోంది. అభ్యర్థుల బలబలాలు.., రాజకీయ పరిస్థితుల ఆధారంగా వారిని ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం. ఎన్నికల్లో ప్రత్యర్థులతో తలబడే శక్తిసామార్థ్యాలు ఆధారంగా జాబితాను సిద్ధం చేస్తున్నారు తెలంగాణ పెద్దలు.

అయితే ఇప్పటికీ 119 నియోజకవర్గాల నుంచి 300 పేర్లను కమిటీ సిఫారసు చేసింది. 20 నియోజకవర్గాలకు ఒక అభ్యర్థి పేరు 25 నుంచి 30 స్థానాలకు ఇద్దరి అభ్యర్థుల పేర్లను సిఫారసు చేసింది. అలానే 30 స్థానాలకు ఇద్దరి అభ్యర్థుల పేర్లను.., 50 నియోజకవర్గాలకు ముగ్గురు చొప్పున 10 నుంచి 14 నియోజకవర్గాలకు నలుగురేసి అభ్యర్థులతో కూడిన జాబితాను స్క్రీనింగ్ కమిటీకి సిఫారసు చేసింది. సామాజిక, స్థానిక సమీకరణాలు సర్వేల ఆధారంగా వారికి టికెట్ కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈనేపథ్యంలో అభ్యర్థుల వడపోతులు.. సర్వేలు ఆధారంగానే జరుగుతున్నట్లు సమాచారం. పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు.., ఇతర సంస్థలతో సర్వేలు ఆధారంగానే ఈ వడబోతల కార్యక్రమం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే టికెట్లు రానివాళ్ళు నిరాశ చెందనవసరం లేదని.. వారికి సముచిత స్థానం కల్పిస్తామని భట్టి మీడియాకు చెప్పారు. టికెట్లు రాని వారికి కూడా వేరే రకంగా న్యాయం చేస్తామని తెలిపారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటింగ్ కారణంగా సమావేశం మధ్యలో రేవంత్ ఉత్తమ్ కోమటిరెడ్డి పలువురు ఎంపీలు పార్లమెంటుకు వెళ్లారని ఆయన వివరించారు.