బాలాపూర్ లడ్డూ.. అందుకుంది సరికొత్త రికార్డు..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో గణేష్ ఉత్సవాల్లో రికార్డు మోతమోగించాలంటే ఒకటి ఖైరతాబాద్ గణేషుడు.. మరోకటి ముగింపు ఉత్సవాల్లో బాలాపూర్ లడ్డూ పాట అని చెప్పాలి.

ఈ సారి బాలాపూర్ లడ్డూ గత ఏడాదికి మించి రికార్డు ధర పలికింది. గత ఏడాది 24 లక్షల 60 వేల రూపాయలు పలికిన బాలాపూర్ లడ్డూ.. ఈ ఏడాది ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఈ సారి ఏకంగా మరో 2 లక్షల 40 రూపాయలు ఎక్కువ పెట్టి పాటలో దక్కించుకున్నారు దాసరి దయానందరెడ్డి.

భాగ్యనగరంలో బాలాపూర్ గణేశుని లడ్డూ వేలంపాటకు ఘన చరిత్ర ఉంది. 11 రోజులు పార్వతీనందుని చేతిలో విశేష పూజలందుకున్న లడ్డూను దక్కించుకున్నవారికి సిరి సంపదలు తులతూగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే పరమ పవిత్రమైన బాలాపూర్ లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీపడుతుంటారు. హోరాహోరీగా సాగిన వేలంపాటలో ఈ ఏడాది తుర్కయాంజల్ కు చెందిన దాసరి దయానంద్ రెడ్డి 27 లక్షలకు లడ్డూను దక్కించుకోవడం విశేషం.

1994 లో 450 రూపాయలతో మొదలైన ఈ లడ్డూ వేలంపాట.. నేడు వందలు.., వేలు… లక్షలను దాటుకుని పదుల లక్షల వైపు ప్రయాణం చేయడం గమనార్హం. అయితే ఏటేటికి బాలాపూర్ లడ్డూ వేలం హెచ్చుపెట్టి పాడేందుకు భక్తులు పోటీపడుతూనే ఉంటారు.   గణేషుడు లడ్డూ వేలం ద్వారా వచ్చి డబ్బును గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తుంటారు ఉత్సవ కమిటీ సభ్యులు.