బీజేపీ ఎన్నికల శంఖారావం.. మోదీ టూర్ ఫిక్స్..!

తెలంగాణ నుంచే బీజేపీ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తోంది. అందుకుగానూ ఈ సారి రాష్ట్రంలో మోదీ టూర్ ప్రత్యేకతను సంతరించుకుంటుంది.

తెలంగాణ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయాలు కొత్తరంగును పులుముకుంటున్నాయి. ఢిల్లీ నుంచి జాతీయ పార్టీ నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తు హోరెత్తిస్తుంటే.. ప్రాంతీయ పార్టీలు మాట యుద్ధానికి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధినేత, దేశ ప్రధాని రెండ్రోజులు పాటు తెలంగాణలో సాగే పర్యటన ప్రత్యేకతను సంతరించుకుంటుంది.

ప్రధాని మంత్రి నరేంద్రమోదీ మహబూబ్ నగర్, నిజామాబాద్ పర్యటన షెడ్యూల్స్ ను పార్టీ ఖరారు చేసింది. అక్టోబర్ 1న మహబూబ్ నగర్, 3న నిజామాబాద్ లో మోదీ పర్యటించనున్నారు. ఆయా జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముందుగా శంషాబాద్ అంతర్జాతీయ విమనాశ్రయానికి ప్రత్యేక విమానంలో 1న మోదీ చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా హెలికాఫ్టర్ ద్వారా మహబూబ్ నగర్ కు బయలుదేరనున్నారు. పలు ప్రారంభోత్సవాలు.., శంకు స్థాపనలకు హాజరై.. అక్కడ బీజేపీ ఏర్పాటు చేయనున్న పార్టీ సమభేరి బహిరంగ సభలో పాల్గొననున్నారు.

మహబూబ్ నగర్ బహిరంగ సభ నుంచే మోదీ ఎన్నికల శంఖారావం పూరిచనున్నారు. అక్కడ నుంచి తిరిగి శంషాబాద్ కు వచ్చి.. అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్తారు మోదీ.  ఆ తరువాత 3న తిరిగి నిజామాబాద్ లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. బహిరంగ సభ ముగిసిన తరువాత ప్రత్యేక హెలికాఫ్టర్ లో బీదర్ బయలుదేరి వెళ్ళనున్నారు మోదీ. దీనికిగానూ ఇప్పటికే పార్టీ పెద్దలు భారీ జనసమీకరణకు శ్రీకారం చుట్టారు. పెద్ద సంఖ్యలో బహిరంగ సభకు ప్రజలను సమీకరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మోదీ కార్యక్రమాలకు భారీ జనసమీకరించాలని పార్టీ సీనియర్లు ఇప్పటికే ఆ పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. అందుకు తగ్గట్లు ప్రణాళికలను రూపొందిచుకుంటున్నారు.