బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలు..!

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు టీటీడీ అధికారులు సర్వసిద్ధం చేస్తున్నారు. ఏర్పాట్లకు సంబంధించిన ముందస్తు పనులు ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుంచి 26వ వరకు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు ధర్మారెడ్డి వివరించారు. శ్రీవారి ఆలయం నుంచి వాహన మండపం.., మాడవీధులు, బేడి ఆంజనేయస్వామి ఆలయం, సుపథం, వైకుంఠ క్యూకాంప్లెక్స్-2  తదితర ప్రాంతాలలో భక్తుల సౌకార్యార్ధం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

అయితే బ్రహ్మోత్సవాల సమయంలో గరుడ సేవకు ఎంతో ఆధ్యాత్మిక ప్రధాన్యత సంతరించుకుంటుంది. సెప్టెంబరు 22న గరుడ సేవకు దాదాపు 2 లక్షల మంది భక్తులు వస్తారని టీటీడీ అధికారులు అంచన వేస్తున్నారు. గరుడ సేవలో పాల్గొనేందుకు వస్తున్న భక్తుల కోసం ఇన్నరింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు వేచి ఉండే భక్తులకు సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవింద నిలయం నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి అనుమతించేలా చర్యలు చేపడుతున్నారు అధికారులు.

గరుడ సేవ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమై.. అర్థరాత్రి 2గంటల వరకు సాగుతోందని.., భక్తులు సంయమనం పాటించి గరుడ వాహనం ఆశీనులైన కలియుగవాసుడిని దర్శించుకోవాలని కోరారు. భద్రతకు సంబంధించిన నిబంధనలు పాటిస్తూ ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా శ్రీవారి వాహన సేవల్లో పాల్గొనాలని టీటీడీ కోరింది.