స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును ఉద్దేశించి హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మార్క్ -ఆంటోని సినిమా సక్సెస్ సెలబ్రేషన్ కార్యక్రమానికి విచ్చేసి విశాల్ చంద్రబాబు అరెస్ట్ పై సంచలన కామెంట్స్ చేశారు. మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఈ కామెంట్సే రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబును కొంచెం ఆలోచించి.., సాక్ష్యాలతో అరెస్ట్ చేస్తే బాగుండేదని చెప్పారు. చంద్రబాబుకే ఆ పరిస్ధితి పడితే.. తనలాంటి సామాన్యుల పరిస్ధితి ఏంటి..? అని ప్రశ్నించారు. చంద్రబాబు గొప్ప నాయకుడిని అన్నారు. చంద్రబాబుకు ఈ కేసులో న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అలానే దీనిపై తాను చింతిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

అయితే విశాల్ బాల్యం కుప్పంలోనే కొనసాగింది. పోయిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుపై వైసీపీ నుంచి బరిలో విశాల్ దిగుతున్నట్లు వార్తలు చక్కర్లుకొట్టాయి. అయితే దాన్ని ఆయన గతంలోనే ఖండించారు. తాను రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్ విషయంపై తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తరువాత హీరో విశాల్ స్పందించిన తీరును టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి నిర్మాతలు దగ్గుపాటి సురేష్, అశ్వనీదత్, నట్టికుమార్ లు, కేఎస్ రామారావు, దర్శకులు రాఘవేంద్రరావు మాత్రమే స్పందించారు. అయితే సినీ రంగానికి పెద్దపీట వేసి.. చిత్రసీమ మనుగడకు బాసటగా నిలిచిన పార్టీ తెలుగు దేశం. అటువంటిది ఆ పార్టీ అధినేత చంద్రబాబు కు ఇటువంటి పరిస్ధితి పడితే కనీసం టాలీవుడ్ హీరో స్పందించకపోవడం శోచనీయమని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.