అష్టదిగ్బంధనంలో కేసీఆర్.. ఛేదించడం కష్టమేనా..?

తెలంగాణలో ఎన్నికల వేళ.. రాజకీయాలు పదునెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ను సైతం విపక్షాలు అష్టదిగ్బంధంలో పడేశాయా..? అంటే అవుననే సమాధానం గట్టిగా వినిపిస్తోంది.

తెలంగాణ సాధారణ ఎన్నికల నగారా మోగిన నాటి నుంచి ఎత్తుకు పై ఎత్తులు రాజకీయంగా షురూ అయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ కన్న ముందుగానే కేసీఆర్ తన 115 మంది ఎమ్మెల్యే అభ్యర్ధులను ప్రకటించారు. సిట్టింగ్ లకే అధిక ప్రాధాన్యత ఇస్తూ.. కొన్నిమార్పులతో కొత్తవారికి సైతం ఆ జాబితా అవకాశం కల్పించారు కేసీఆర్. తాను మాత్రం తన సిట్టింగ్ స్థానం గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి హోదాల్లో రెండు స్ధానాల్లో పాల్గొనేందుకు సిద్దమైన కేసీఆర్ పై ఆనాడే బాగానే విమర్శలు గుప్పించాయి విపక్షాలు. అయితే కేసీఆర్ రెండు స్థానాల నుంచి పోటీ అన్న కథ వేరే ఉంది కాబట్టే .. ముందు జాగ్రత్తగా రెండు స్థానాల నుంచి పోటీకి సిద్ధమైయ్యారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్, టీడీపీ లకు కంచుకోటగా ఉన్న గజ్వేల్ ను ప్రత్యేక రాష్ట్రం సెంటిమెంట్ తో అక్రమించుకున్నారు కేసీఆర్. 2014,2018 సాధారణ ఎన్నికల్లో వరుస విజయాలతో తిరుగులేని విధంగా నియోజకవర్గంలో స్ధిరంగా ఉన్న కేసీఆర్ కు ఈ సారి సాధారణ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ కొట్టేందుకు బీజేపీ.., కాంగ్రెస్ పావులు కదుపుతోంది. వ్యూహాత్మకంగా పాలన పగ్గాలు చేజిక్కించుకోవడంతో పాటు అభ్యర్ధుల ఎంపిక, ముఖ్యంగా కేసీఆర్ ను రెండు స్ధానాల్లో ఓడించేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి విపక్షాలు.

గజ్వేల్ లో ఈసారి కేసీఆర్ కు పోటీగా బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేంద్రను బరిలో దింపుతోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా మాజీ ఎమ్మెల్యే, ప్రజాధారణ ఉన్న నేత తూంకుంట నర్సారెడ్డిని బరిలో నిలిపింది. దీంతో ఇక్కడ భారీస్థాయిలో పొలిటికల్ ఫైట్ తప్పదని పొలిటికల్ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు సర్వేలన్నీ ఈ సారి బీజేపీ అభ్యర్ధి ఈటల గెలుపును సూచిస్తున్నాయి. దీంతో గజ్వేల్ లో వార్ ఒన్ సైడ్ అనుకున్న కేసీఆర్ కు సర్వేలు చెబుతున్న సత్యాలతో వార్ ఈజ్ కమింగ్ టూ సైడ్ అన్న రీతిగా మారిందని బీఆర్ఎస్ గ్రహించింది.

అందుకే తెలివిగా కేసీఆర్ రెండో నియోజకవర్గం కామారెడ్డిని నుంచి కూడా పోటీ చేయాల్సి వస్తోందని విపక్షపార్టీలు విమర్శిస్తున్నాయి. గజ్వేల్ లో ఓటమి భయంతోనే కామారెడ్డిని కేసీఆర్ ఎంపిక చేసుకున్నారని మొదటి నుంచి కాంగ్రెస్ ఆరోపిస్తున్న మాటే.అయితే కామారెడ్డి లో కూడా బలమైన అభ్యర్ధిని బరిలో దించేందుకు కాంగ్రెస్ అడుగులు వేస్తోంది.  ఏదీఏమైన ఈ సారి అన్నీ పార్టీలకు గెలుపు అంత సులువుకాదు అన్న రీతిగా రాజకీయం మారిందనే చెప్పాలి.