చంద్రబాబుకు బెయిల్..కానీ ఎన్ని ట్విస్టులో..!

స్కిల్ కేసులో అరెస్టై 53 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హై కోర్టులో ఊరట లభించింది.

స్కిల్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి మధ్యంతర బెయిల్ ను మంజూరు చేశారు. గత 53 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు తీవ్ర అనారోగ్యం భారీన పడ్డారు.  దీనిపై చంద్రబాబు తరుఫున న్యాయవాదులు ఏపీలో హైకోర్టులో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్ధించారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్ధితి రోజురోజుకు క్షీణిస్తోందని.., కంటికి క్యాట్రాక్ ఆపరేషన్ చేయకుంటే పరిస్ధితి విషమంగా మారే అవకాశం ఉందని న్యాయమూర్తి ఎదుట సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ లూధ్రా, దమ్మాలపాటి శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. ఈ వాదనలు నిన్నటితో ముగిశాయి. హైకోర్టులోని 30 వ కోర్టు హాల్ జస్టిస్ మల్లిఖార్జునరావు చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పును వెలువడించారు.

దాదాపు 53 రోజుల తరువాత చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ వచ్చిందనే చెప్పాలి. చంద్రబాబు ఆరోగ్యపరంగా తలెత్తిన అనేక సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఏపి హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. అయితే బెయిల్ నింబంధనల ప్రకారం చంద్రబాబుకు నాలుగు వారాలు రిలీఫ్ ఇస్తూ ఈ బెయిల్ ను ఇచ్చింది. ఈ నాలుగు వారాల పాటు సాక్ష్యులను ప్రభావితం చేయడం, రాజకీయ సభలు, ప్రసంగాలు చేయడం వంటివి నిషిద్దం. అలానే చంద్రబాబు ఏ హాస్పటల్లోనైనా వైద్యం చేయించుకుని వెసులుబాటును కల్పించింది. లక్ష రూపాయలతో రెండు పూచికత్తులను ఏసీబీ కోర్టుకు అందజేయాలని ఆదేశించింది.

దీంతో టీడీపీ సీనియర్ నాయకులు దేవినేని ఉమా, బొండ ఉమాలు చంద్రబాబుకు పూచికత్తు ఇచ్చారు. దీంతో మంగళవారం సాయంత్రం 5 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు బయటకు వచ్చారు. కుటుంబ సభ్యులను, పార్టీ నేతలను పలకరించారు. అనంతరం తనకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని చంద్రబాబు చెప్పారు.

తనపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చూపిన ప్రేమను ఎన్నడూ మరిచిపోనని చెప్పారు. మరోవైపు చంద్రబాబు రెగ్యూలర్ బెయిల్ కూడా విచారణలో ఉంది. దానిపై కూడా త్వరలో స్పష్టత వస్తోందని చంద్రబాబు తరుఫున న్యాయవాదులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.