జ్ఞానేశ్వర్ రాజీనామా.. తెర వెనుక రాజకీయం ఇదేగా..?

దేశంలో ప్రాంతీయ పార్టీల ఉనికిని కూకటివేళ్లతో పెకిలించి వాటిని అస్తిరపర్చడం కేంద్రంలో ఆ పెద్దన్న పాత్ర పోషిస్తున్న రెండు పార్టీలకు మహా సరదా…     

ఇప్పుడు దేశంలో నడుస్తోంది కాషాయ దళపతి నమో గిరి. ఈ నరేంద్రుడి కనుసన్నల్లో రాజకీయాలు నడవకుంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. చెప్పినట్లు తోక ఆడిస్తే.. పక్కన కూర్చోపెట్టుకుని అంతా మందే అంటాడు. అది కాదు అని ధిక్కరిస్తే దోల తీరుస్తాడు. ఐటీ, ఈడీ, సీబీఐ దాడులంటూ రాష్ట్రాలను షేక్ చేస్తాడు. ప్రాంతీయ పార్టీ పాలన ఉన్న రాష్ట్రాల దుస్ధితి ఈ నాటిది కాదు. కేసులతో భయబ్రాంతులకు గురిచేసే ఆ ఢిల్లీ పెద్దలకు దక్షిణాధి నుంచే కాదు దేశ వ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో వ్యతిరేక పవనాలు వీస్తూనే ఉన్నాయన్నది వాస్తవం.

ఇదిలా ఉంటే తెలంగాణలో పొలిటికల్ గేమ్ ఛేంజర్ గా మారిన కేసీఆర్.. మోదీ అండ్ టీం కు జీ హుజూరు అన్న మాదిరిగా మారారు. ప్రత్యక్షంగా బీజేపీని తిట్టిపొస్తూనే తెరవెనుక చేసే రాజకీయాలను తరుచూ కాంగ్రెస్ ఎండగడుతూనే ఉంది. ఈ నేపధ్యంలో నిన్న(సోమవారం) తెలంగాణ టీడీపీ అధ్యక్షత పదవికి కాసాని జ్ఞానేశ్వర్ గుడ్ బై చెప్పాడు. తాను అధ్యక్ష్య బాధ్యతకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. తెలంగాణ సాధారణ ఎన్నికల్లో అభ్యర్ధుల లిస్ట్ రెడీ చేసి.. పార్టీ అధినేత చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం  వేచి చూసిన అవకాశం ఇవ్వలేదని.., జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు 20 సార్లు ఫోన్  చేసినా.. లిఫ్ట్ చేయలేదని జ్ఞానేశ్వర్ ఆరోపించారు. బాలయ్య కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని,  క్యాడర్ కు  సమాధానం చెప్పల్లేక ఈ రాజీనామా నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన మీడియాకు చెప్పారు.

అయితే జ్ఞానేశ్వర రాజీనామా వెనుక తెరమాటునా పెద్ద రాజకీయమే జరిగిందని పొలిటికల్ గాసిప్స్ వినవస్తున్నాయి. రాష్ట్ర విభజన తరువాత తెలుగు దేశం కేడర్ మొత్తాన్ని కారు పార్టీ ఆక్యుపై చేసింది. అప్పటి టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ  కూడా పార్టీకీ రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్సీ అయ్యాడు. ఇప్పుడు కాసాని రాజీనామా వెనుక కూడా ఏదో మంచి ఆఫర్ ఉండి ఉండబట్టే అలా డిసైడ్ అయ్యారని విశ్లేషణలు వెల్లవెత్తుతున్నాయి.

దోస్తులందరూ ఒకే చోట ఉన్న బీఆర్ఎస్ లోకే జ్ఞానేశ్వర్ వెళ్తున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. తెర వెనుకు మాజీ టీడీపీ బ్యాచ్ జ్ఞానేశ్వర్ తో మంతనాలు జరుపుతున్నారని సమాచారం లేకపోలేదు. మొత్తంగా ఢిల్లీ నుంచి స్వీచ్ నొక్కితే బల్బులు తెలంగాణలో వెలుగు చిమ్ముతున్నాయన్నది అందరూ అంటున్న మాట.