కోమటిరెడ్డి బ్రదర్స్.. మీకు ఏదైనా సాధ్యమేగా..?

తెలంగాణ ఎన్నికల సయయం దగ్గరపడేకొద్ది ప్రధాన రాజకీయ పార్టీలు, నేతలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ రాజకీయ వ్యూహాలకు పదును పెడ్డుతున్నారు.

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.., శత్రువులు అంటూ ఉండరు. ఈ సామెత పాలి ‘టిక్స్’ కు టాగ్ లైన్ వంటిది. అవునన్నా.. కాదన్నా.. ఇది అక్షర సత్యం. తెలంగాణ సాధారణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి రాజకీయాల్లో రసవత్తరంగా మారాయి. మనుగడ కోసం కండువా మార్పు నేతలకు అనివార్యమైంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు, మొదటి లిస్ట్ తమ పేరు రాలేదని కొందరూ.., టికెట్ ప్రకటించి.. బీ ఫాం ఇవ్వలేదని మరి కొందరూ.., తమకు నచ్చని నేతకు టికెట్ ఇచ్చారని ఇంకొందరూ పార్టీ కండువాలు మార్చక తప్పని పరిస్ధితి. ఈ జంపింగ్ జపాంగ్ ల మధ్య నల్గొండ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

రెండున్నర దశాబ్ధాలుగా నల్గొండ రాజకీయాలను శాసిస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్.. రాజకీయంగా ఒక సంకట పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ లో ఉండలేక.., భవిష్యత్తు రాజకీయాల కోసం పోయిన ఏడాది ఆగష్టులో మునుగోడు ఎమ్మెల్యే పదవీకి.., కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తరువాత బీజేపీ చేరిక.., మునుగోడు ఉప ఎన్నికలలో ఘోర ఓటమి వంటివి చకచక జరిగిపోయాయి. ఇది రాజగోపాల్ కు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. మరోవైపు అన్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతూ.. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ ఉండటంపై విమర్శలు బాగానే వచ్చాయి. ఈ క్రమంలో బీజేపీ కూడా రాజగోపాల్ రెడ్డి విషయంలో చిన్న చూపు చూడటం, ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం వంటివి ఎందుకో ఆయనలో నైరాశ్యం అలుముకుంది.

దీనికి తోడు నిన్న ప్రకటించిన బీజేపీ అభ్యర్ధుల మొదటి జాబితాలో రాజగోపాల్ రెడ్డి పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి.., అవమాన భారంతో పార్టీ నుంచి వెను తిరాగాల్సిన అగత్యం ఏర్పడిందని పొలిటికల్ విశ్లేషణలు ఇప్పటికే ఊపందుకున్నాయి. ఈ నేపధ్యంలో బీజేపీ కండువా మార్చి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్దంపడుతున్నట్లు సమాచారం. రేపు ఢిల్లీ వెళ్లి.. కాంగ్రెస్ నేత రాహుల్ సమక్షంలో రాజగోపాల్ రెడ్డి పార్టీ కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం ఊపందుకోంది.

అలా జరిగితే ఎల్బీనగర్ లేదా మునుగోడు నుంచి బరిలో ఉండే అవకాశం ఉంది. ఈ స్థానాలపైనే ఆయన ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే.., ఎన్నికల వేళ.. జమ్మిక్కులు.., జపింగ్ జపాంగులన్నీ సర్వసాధానమే అయినా.. కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరైన రాజగోపాల్ రాజకీయం అవకాశవాదంతో ముడిపడి ఉండటం చర్చకు దారితీస్తోంది.