బిటెక్ రవి అరెస్ట్.. పులివెందుల్లో అలజడి..!

కడప జిల్లా పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బీటెక్ రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. ఆయనను న్యాయమూర్తి ఎదుట హాజపరిచారు.

కడపలో కుట్రతో కూడిన రాజకీయాలతో రగిలిపోతోంది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత జిల్లాలో వైసీపీ పై అసంతృప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల్లో ఫ్యాన్ కు రివర్స్ గాలి వీస్తోంది. రోజురోజుకు తెలుగుదేశం బలపడుతోంది. గతంలో కడపలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వహించారు.దీంతో  కడప జిల్లాలో టీడీపీ శ్రేణులు ఫుల్  యాక్టీవ్ మూడ్ లోకి వచ్చాయి. ఆ తరువాత చంద్రబాబు పర్యటనతో యావత్ పార్టీ కేడర్ లో జోష్ నింపింది. దీంతో కడప జిల్లాలో ఈ సారి ఎన్నికలు తెలుగుదేశానికి వార్ వన్ సైడ్ అయ్యేలా కనిపించడంతో అధికార పార్టీలో అలజడి మొదలైంది. ఎలాగైనా టీడీపీ పై కేసులతో పై చెయ్యి సాధించాలని కుట్రలు పన్నింది.  బీటెక్ రవిపై అక్రమ కేసు నమోదు చేసిన వల్లూరు పోలీసులు.. మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

పులివెందుల నుంచి కడపకు వస్తుండగా యోగి  వేమన విశ్వ విద్యాలయం వద్ద అదుపులోకి తీసుకుని రిమ్స్ కు తరలించారు. అనంతరం కడప మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. అయితే 10 నెలల క్రితం యువగళం పాదయాత్రలో భాగంగా కడప విచ్చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు బీటెక్ రవి సారధ్యంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. అలానే కడప విమానాశ్రయంలో ఉన్న లోకేష్ ను ఆహ్వానించేందుకు బీటెక్ రవి విమానాశ్రయంలో వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీటెక్ రవికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాట కూడా జరిగింది. ఇది జరిగి 10 నెలలు కావస్తోంది. దీనిపై వల్లూరు పోలీసులు ఈ రోజు తీరిగ్గా కేసు నమోదు చేశారు. విమానాశ్రయం వద్ద రవి పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్న కారణంతోనే కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

బీటెక్ రవి అరెస్ట్ ను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. అక్రమ కేసులతో తెలుగుదేశం పార్టీ నేతలను భయపట్టాలని చూడటం అవివేకమని ధ్వజమెత్తారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు బీటెక్ రవి అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నారు. ఆయనకు మద్దతుగా సంఘీభావం తెలియజేస్తున్నారు.