ఎన్నికల వేళ..వీధికెక్కిన నగదు, బంగారం..!

సార్వత్రికానికి సెమీ ఫైనల్ గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగింది. దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

వచ్చే నెలలో తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ నవంబరు 3 న వెలువడనున్నది. నవంబర్ 7 నుంచి 30 లోగా ఐదు రాష్ట్రాల వారీగా అన్నీ రాష్ట్రాల్లో ఎన్నికలను పూర్తి చేసి.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడించనున్నాయి. ఈ ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ 5 ముగుస్తోందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అనూష్ చంద్రపాండే, అరుణ్ గోయెల్ ఢిల్లీలోని మీడియాకు వివరించారు. తెలంగాణ లో నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. ఈ క్రమంలో నాలుగు రాష్ట్రలతో పాటు తెలంగాణలో ఎలక్షన్ షెడ్యూల్ ను ఈసీ ప్రటికించిన నాటి నుంచే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది.

ఈ నేపధ్యంలో హైదరబాద్ లో విస్తృతంగా పోలీసులు తనిఖీ చేస్తున్నారు. 50 వేలకు మించి డబ్బును రవాణ చేస్తే.. పోలీసులు సీజ్ చేస్తున్నారు. ఇప్పటికే నిజాం కాలేజ్ పరిసరాల్లో పోలీసులు చేసిన తనిఖీల్లో గెట్ నెంబర్ 1వద్ద ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న 7 కిలోల బంగారం, 300 కిలోల వెండిని పోలీసులు సీజ్ చేశారు. అలానే చందానగర్ పీస్ పరిధిలోని తారానగర్ లో అక్రమంగా తరలిస్తున్న భారీగా బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. సుమారు 5.65 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఫిలింనగర్ లో కారులో తరలిస్తున్న 30 లక్షల నగదు.., గోషామహల్ పరిధిలో 15 లక్షల నగదు.., శంకర్ పల్లిలో 80 లక్షలు .. ఇలా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేయడం ద్వారా దాదాపు 3 కోట్ల నగదు.., 16 కిలోల బంగారం పట్టుపడింది.

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన కొన్ని గంటల్లోనే పెద్ద మొత్తంలో ఇలా నగదు.., బంగారం దొరకడంతో అధికారులు అవాక్కవుతున్నారు. ఓటర్లును ప్రలోభపెట్టకుండా ఇంకా నిఘాను కట్టుదిట్టం చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.