అవునంటే కాంగ్రెస్.. లేదంటే బీఆర్ఎస్..!

తెలంగాణ సాధారణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

రాజకీయం అంటేనే ఎత్తుకు పై ఎత్తులు. ఎన్నికల్లో టికెట్ దక్కకుంటే కండువాలు మార్చి.. ఉనికిని కాపాడుకోవడం సర్వసాధారణమే. పదేపదే పార్టీల మార్పుతో సాధించేంది ఏమీ లేదు అన్న వాస్తవాలు తెలిసొచ్చే వరకు నేతలు అంగట్లో సరుకు మాదిరిగా అమ్ముడుబోక తప్పదు అన్నట్లు భావించాల్సిందే. దివంగత పీజేఆర్ కుటుంబానికి కాంగ్రెస్ తో ఐదు దశాబ్ధాలకు పైగా  అనుబంధం ఉంది. ఆయన వారుసులుగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన విష్ణువర్ధన్ రెడ్డి, విజయారెడ్డి లు  పీజేఆర్ అంత గొప్ప గుర్తించు తెచ్చుకోవడంలో వెనుకపడ్డారని విశ్లేషణలు ఉన్నాయి.

అయితే తండ్రి మరణం తరువాత రాజకీయాల్లోకి వచ్చిన విష్ణువర్ధన్ 2004 ఉప ఎన్నికల్లో ఖైరాతాబాద్ నుంచి.., 2009 జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత 2014, 2018 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ స్థానం నుంచే ఓటమి పాలయ్యారు. రెండు దశాబ్ధాలుగా కాంగ్రెస్ కొనసాగుతున్న విష్ణువర్థన్ రెడ్డి టికెట్ ఇవ్వలేదని నిన్న కేసీఆర్ ను కలిసి.. కండువా మార్చేందుకు సిద్ధమయ్యారన్న వార్త వైరల్ గా మారింది. కుమార్తె కూడా రెండు సార్లు ఎమ్మెల్యే అభ్యర్ధిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న కాలం కలిసిరాలేదు. ఆ తరువాత ఆమె వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల్లో పనిచేసి.. చివరకు ఆ మొన్న రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 

బీఆర్ఎస్ టికెట్ రాకుంటే కాంగ్రెస్ లోకి, లేకుంటే బీజేపీలోకి నేతలు జంప్ అవుతున్నారు. మొన్న కాంగ్రెస్ లో టికెట్ రాలేదని పొన్నాల దశాబ్ధాల కాంగ్రెస్ స్నేహాన్ని సైతం వదులుకుని బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. నిన్న పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డికి జూబ్లిహిల్స్  టికెట్ ఇవ్వలేదని.., నానా యాగి చేసి కేసీఆర్ ను కలిశారు. నాగం జనార్థన్ రెడ్డికి కాంగ్రెస్  టికెట్ ఇవ్వలేదని అలకపాన్పు ఎక్కితే .. బీఆర్ఎస్ లో రావాలని ఆహ్వానించేందుకు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు వెళ్ళి కలిశారు. ఇలా కాంగ్రెస్ అసంతృప్తులను బీఆర్ఎస్ ఆకర్షిస్తుంటే.. బీజేపీ, బీఆర్ఎస్ లో ఉన్న నేతలను ‘ఘర్ వాపసీ’ పేరుతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఆహ్వానాలను పంపుతోంది.

ఇలా తెలంగాణ గడ్డపై రాజకీయ పార్టీలు గెలుపు కోసం అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకునేందుకు ఎంతకైనా దిగజారుతున్నారని వాదనలు ఉన్నాయి. లక్షల ఓట్లు ఉన్న నియోజకవర్గాల్లో కనీసం 5 వేల ఓటు బ్యాంకు ఉన్న నాయకుడిని సైతం వదలకుండా పార్టీల్లోకి ఆహ్వానిస్తూ.. ఆఫర్లపై ఆఫర్లు ఇస్తూ.. కండువా మార్చుకోవాలని అధికార, ప్రధాన విపక్ష పార్టీలు సైతం అభ్యర్ధించడం ఆశ్చర్యాన్ని గురి చేస్తోంది.