దయనీయ స్థితిలో వైఎస్ఆర్టీపీ.. అయోమయంలో షర్మిల..!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ లేనిలోటు ఆ కుటుంబంలో ప్రస్పూటంగా కనిపిస్తోంది. తెలంగాణలో తనదైన మార్క్ రాజకీయాలతో ముందుకు పోదామని గంపెడు ఆశలతో వచ్చిన షర్మిలకు అడుగడుగునా నిరాశ ఎదురైంది.

తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ లోటును భర్తి చేసేందుకు.., ఉద్యమ గడ్డపై ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టేందుకు పుట్టుకొచ్చిన పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. యువత ఉపాధి, ఉద్యోగాల కోసం గళమెత్తి.. కేసీఆర్ పై యుద్ధం ప్రకటించింది షర్మిల. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డగా తనదైన మార్క్ రాజకీయాలతో ముందుకుపోతున్న షర్మిలకు కాంగ్రెస్ గాలి సోకింది. దీంతో కాంగ్రెస్ మాయలో పడి.. ఒక దశలో పార్టీని విలీనం చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. కానీ ఏమైందో ఏమో కానీ.. తీరా ఎన్నికల వేళ ఆమె పరిస్ధితి అగమ్యగోచరంగా మారింది.

ఆ మొన్న డీకే శివకుమార్ ను కలిసింది షర్మిల. అనంతరం రాహుల్, సోనియాలతో భేటీ కూడా అయ్యారు. కానీ తెర వెనుకుండి చక్రం ఎవరు తిప్పారో కానీ.. షర్మిల ఆశలు ఆడియాశలు అయ్యాయి. పార్టీలో జాతీయ స్ధాయిలో కీలక పదవీ.., పాలేరు సీటుతో పాటు మరికొన్ని డిమాండ్స్ ను కూడా ఒప్పుకున్న  కాంగ్రెస్ అధిష్టానం అంతలోనే ప్లేట్ ఫిరాయించింది.  డిమాండ్స్ పై గంపెడు ఆశలు పెట్టుకున్న షర్మిల పార్టీ కేడర్ ను సైతం ఒప్పించి అన్నీ ఏర్పాట్లును సైతం సిద్ధం చేసుకుంది. కానీ.. కయ్యాలమారి కాంగ్రెస్ షర్మిలకు రిక్త హస్తలను చూపింది. దీంతో దిక్కుతోచని స్ధితిలో షర్మిల తన వ్యూహాన్ని ఉన్నఫలంగా మార్చుకోవాల్సి వచ్చింది.

తెలంగాణలో ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది షర్మిల. అంతేకాక త్వరలో అభ్యర్ధులను ప్రకటించేందుకు జాబితా సిద్ధం చేస్తున్నట్లు మీడియాకు లీకు వదిలారు. ఈ ఎన్నికల్లో విజయమ్మ, బ్రదర్ అనిల్ కూడా పోటీలో ఉంటారని తెలుస్తోంది. అయితే షర్మిల పాలేరు నుంచే బరిలో దిగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఈ క్రమంలో ఆ పార్టీకి ఎన్నికల సంఘం బైనాక్యులర్ గుర్తును కేటాయించింది. జనరల్ గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘంపై ఒక్కింత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్టీపీ. ఇండిపెండెంట్ అభ్యర్ధులకు కేటాయించినట్లుగా ఆ గుర్తును  కేటాయిచడం పట్ల రాజకీయ వర్గాలు పెద్ద చర్చ నడుస్తోంది. ఎంతో ఉన్నతంగా ఉద్యమాలు చేసి.. ప్రజా సమస్యలను తన గొంతుగా మార్చుకుని పోరాడిన పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న షర్మిల పార్టీకి ఇటువంటి గుర్తు కేటాయించడం అవమానకరంగా పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.

మొత్తంగా కాంగ్రెస్ నమ్ముకుని రాజకీయాల్లో కొనసాగిన తండ్రి వైఎస్ఆర్.., అన్న జగన్  పరిస్ధితి చూసి కూడా షర్మిల ఆ పార్టీ వైపు మొగ్గుచూపడం కొంత విమర్శలు ఎదుర్కొన్న చివరికి సొంతగా పోటీ చేస్తాను అనడం పట్ల పార్టీ వర్గాల్లో కొత్త జోష్ ను నింపుతోంది. షర్మిల దోస్తీని కాదని.. ముందుకు పోతున్న తెలంగాణ కాంగ్రెస్ కు భారీ నష్టం కూడా షర్మిలతోనే అన్న విశ్లేషణలు లేకపోలేదు. ముందుగా కాంగ్రెస్ ఓట్లు చీలి గల్లంతైన తరువాతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు షర్మిల పార్టీ వైపు ట్రర్న్ అవుతోంది అని సర్వేలు వెల్లడిస్తున్న వాస్తవాలు.